ట్విట్టర్ వేదికగా జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు స్ట్రాంగ్ కౌంటర్:
మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలుకుతూ, ట్విట్టర్ ద్వారా జగన్ చేసిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు. కన్నతల్లి, తోడబుట్టిన చెల్లిని మోసం చేసిన వ్యక్తిగా ప్రపంచంలో జగన్ వంటి దౌర్భాగ్య నేత మరెక్కడా కనిపించరని విమర్శించారు. ప్రజా సేవ చేయడానికి అర్హత లేని ఆయన డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని అన్నారు.
జగన్ కుటుంబమే రాష్ట్రానికి జల ద్రోహం చేసింది:
“జగన్, తన కుటుంబం ప్రజలకు జల ద్రోహం చేశారు. నాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన జగన్, కృష్ణా మిగులు జలాల హక్కును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ రాసి తాకట్టు పెట్టారు,” అంటూ నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం రివర్స్ టెండరింగ్, ఇతర విమర్శలు:
పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలల ఆలస్యం చేసి డయాఫ్రం వాల్‌ను దెబ్బతీశారని, ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యామ్‌ను ధ్వంసం చేసి 38 మంది ప్రాణాలు పోగొట్టారంటూ నిమ్మల తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3,800 కోట్లను తారుమారు చేసి నదుల అనుసంధానానికి ఆటంకం కలిగించినది జగన్ కాదా? అని ప్రశ్నించారు.