Airport Rules: బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు వద్ద భారీ బంగారు అక్రమ రవాణా వెలుగు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు వద్ద నుంచి 14.2 కిలోల బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 12.56 కోట్లు అని అంచనా. రన్యా రావు, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె. ఈ కేసులో మొత్తం రూ. 17.29 కోట్ల విలువైన ఇతర విలువైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో, ఆమె బంగారు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఉన్నట్లు బయటపడింది. ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడానికి భారీగా కమిషన్ తీసుకునేదని అధికారులు గుర్తించారు.
విమాన ప్రయాణంలో బంగారం, నగదు పరిమితులు తెలుసుకోవాలి
విమానాల్లో ప్రయాణించేటప్పుడు అనేక నిబంధనలు వర్తిస్తాయి. భారత్‌లోని విమానాశ్రయాల్లో కస్టమ్స్, భద్రతా తనిఖీలు కఠినంగా ఉంటాయి. నిర్దేశించిన పరిమితికి మించి బంగారం లేదా నగదు తీసుకువెళితే, మీరు జరిమానా లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దేశీయ ప్రయాణం (ఇండియాలో)
- బంగారంపై ప్రత్యేక పరిమితి లేదు, కానీ పెద్ద మొత్తంలో ఉంటే మూలం నిరూపించాలి.
- 500 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే సరైన బిల్లు అవసరం.
- నగదు పరిమితి లేకపోయినా, రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే మూలం చెప్పాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ ప్రయాణం
- భారతదేశం నుంచి విదేశాలకు ప్రయాణించే వారు తమ గమ్యదేశ కస్టమ్స్ నియమాలను తెలుసుకోవాలి.
- విదేశాల నుంచి భారతదేశానికి తిరిగి వస్తే,
- పురుషులకు ₹50,000,
- మహిళలకు ₹1,00,000,
- పిల్లలకు ₹25,000 వరకు బంగారం అనుమతించబడింది.
- అంతకుమించి ఉంటే కస్టమ్ సుంకం చెల్లించాలి.
నగదు పరిమితి
- విదేశాలకు $3,000 (సుమారు ₹2.5 లక్షలు) వరకు తీసుకెళ్లవచ్చు.
- తిరిగి వస్తున్నపుడు, $5,000 వరకు నేరుగా తీసుకురావచ్చు, $10,000 దాటితే కస్టమ్స్‌కు సమాచారం ఇవ్వాలి.
నిర్దేశించిన పరిమితికి మించి బంగారం లేదా నగదుతో ప్రయాణిస్తే కస్టమ్స్, ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించవచ్చు. బిల్లు లేకుంటే బంగారం, నగదు జప్తు అవ్వడంతో పాటు భారీ జరిమానా లేదా జైలు శిక్ష విధించబడే అవకాశం ఉంది.
మరిన్ని వ్యాపార, ఆర్థిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.