ఆంధ్రప్రదేశ్ గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. స్కూళ్లు, షాపులు, బ్యాంకులు మూతపడి, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల 1/70 యాక్ట్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి.
అయినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు. “గిరిజన జాతుల సంక్షేమం, అభివృద్ధి మా ప్రథమ లక్ష్యం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల మెరుగుదలకు మేము కృషి చేస్తున్నాం. అరకు కాఫీతో సహా గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులకు కేటాయించడం వంటి చర్యలు చేపట్టాం. 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు లేదు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన భయాందోళనలతో గిరిజనులు కంగారు పడాల్సిన అవసరం లేదని” ఆయన స్పష్టం చేశారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా దీనిపై స్పందిస్తూ, 1/70 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుందని, గిరిజన హక్కులను కాపాడుతామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి మాఫియాను నిర్మూలించి, మెరుగైన ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.