మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక మంచి విజయం సాధించింది. అయితే, ఈ వేడుకలో చిన్న పాత్రలో నటించిన 30 ఇయర్స్ పృథ్వీ రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. దీనికి స్పందనగా, వైకాపా శ్రేణులు సోషల్ మీడియా వేదికగా #BoycottLaila ట్రెండ్‌ను ప్రారంభించాయి. కొన్ని గంటల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
సినిమాకు ఈ పరిణామం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గ్రహించిన హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సమయంలో తామక్కడ లేకపోవడం వల్ల అడ్డుకోలేకపోయామని తెలిపారు. చిరంజీవిని రిసీవ్ చేసేందుకు వెళ్లిన కారణంగా సభలో ఉన్నారనే అపోహ తొలగించుకోవాలని కోరారు. అయితే, విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినప్పటికీ, వైకాపా సోషల్ మీడియా వర్గాలు తగ్గడంలేదు.
పృథ్వీ క్షమాపణలు చెప్పకుంటే..?
విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పే సమయానికి బాయ్‌కాట్ ట్వీట్లు 25,000 ఉండగా, ఇప్పటి వరకు లక్ష ట్వీట్లు దాటాయి. సోషల్ మీడియా వేదికగా #BoycottLaila హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటి వరకు 1.15 లక్షల ట్వీట్లు నమోదయ్యాయి. కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం వరకు మాత్రమే కాకుండా, చిత్ర యూనిట్‌పై మరింత ఒత్తిడి పెంచుతున్నారు. విశ్వక్ సేన్ క్షమాపణలు సరిపోవని, తప్పక పృథ్వీ క్షమాపణలు చెప్పాలని వైకాపా శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
ఒకవేళ పృథ్వీ క్షమాపణలు చెప్పకపోతే, సినిమా హెచ్‌డీ ప్రింట్ లీక్ చేయడం ఖాయమని కొందరు హెచ్చరిస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత కూడా నెగెటివ్ ప్రచారం కొనసాగుతుందని, చిత్రబృందం రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వివాదాన్ని ముగించేందుకు విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, పృథ్వీ అంత ఈజీగా క్షమాపణలు చెప్పే వ్యక్తి కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు కలిగిన నష్టం..
ఇక, లైలా సినిమా విశ్వక్ సేన్ లేడీ గెటప్‌పై చర్చించాల్సిన సమయంలో ఇలా బాయ్‌కాట్ లైలా వివాదం రాజుకోవడం చిత్ర యూనిట్‌కి పెద్ద షాక్ ఇచ్చింది. సినిమా ఈవెంట్‌లో ఒకరి మాటల వల్ల మొత్తం టీమ్ బాధపడాల్సి రావడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండగా, ఈ వివాదం సద్దుమణిగి సినిమా సాఫీగా విడుదల కానుందా అనేది చూడాలి.