ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి, దాదాపు 27 ఏళ్ల తర్వాత ఆప్ పార్టీ ఆధిపత్యానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే, గెలిచి ఎన్నో గంటలు గడిచినా, కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా ప్రకటించలేదు. అనేక పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ఫైనల్ నిర్ణయం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తావులేకుండా బీజేపీ ఎంపీ రవి కిషన్, ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ ఆశ్చర్యం కలిగించే వ్యక్తిని సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందని ఆయన హింట్ ఇచ్చారు. దీంతో ఢిల్లీ కొత్త సీఎంగా ఎవరు అనేదానిపై ఉత్కంఠ పెరిగింది.
బీజేపీ వ్యూహం.. అనూహ్య అభ్యర్థి?
బీజేపీలో అంతర్గత వ్యవస్థ బలంగా ఉండటంతో, సామాన్య కార్యకర్త అయినా లేదా కార్పొరేటర్ అయినా సీఎం కావడానికి అవకాశం ఉందని రవి కిషన్ పేర్కొన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ గతంలో తీసుకున్న నిర్ణయాలు దీనికి నిదర్శనమని అన్నారు. మీడియా ఊహించిన అభ్యర్థుల్లో సీఎం ఉండకపోవచ్చని ఆయన పరోక్షంగా సూచించారు.
పర్వేశ్ వర్మ ముఖ్యమంత్రి అవుతారా?
సీఎం పదవికి ప్రధానంగా పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ఈ నేత, మాజీ ఢిల్లీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించడం ఆయనకు బలమైన పాయింట్. RSS బ్యాక్‌గ్రౌండ్ ఉండటం, వెస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలవడం కూడా ఆయనకు అనుకూలంగా మారింది.
సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ అగ్రనేతల మంతనాలు
పర్వేశ్ వర్మతో పాటు రమేష్ బిధూరి, మనోజ్ తివారీ, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా వంటి పలువురు పేర్లు సీఎంగా ప్రచారంలో ఉన్నాయి. మహిళ సీఎం అవుతారా? సిక్కు కమ్యూనిటీకి ఈసారి అవకాశం వస్తుందా? అనే చర్చలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025
70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఆప్ పార్టీ కేవలం 22 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం చెందగా, కాంగ్రెస్ మరోసారి ఖాతా తెరవలేకపోయింది. ముఖ్యమంత్రి అటిషి తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు. మంగళవారం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఇతర నేతలతో భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నారు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీ ఊహించని నేతను ఎంపిక చేస్తుందా? త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.