ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా, ది రిటైర్డ్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అన్న క్యాంటీన్ల కోసం భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. వారు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి రూ.6,66,666 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జి. పట్టాభి రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన శ్రీకాళహస్తి ప్రతినిధులు
అమరావతిలోని సచివాలయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వారు ఈనెల 21 నుంచి మార్చి 6 వరకు శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని సీఎంకు అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
✅ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల సంఖ్య పెంపు
రాష్ట్రంలోని ఆలయ ధర్మకర్తల మండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం కల్పించేందుకు ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఆలయ పాలకమండలిలో అదనంగా మరో రెండు స్థానాలు కల్పించింది.
✅ ఉపాధ్యాయ సంఘాలకు ఓడీ సదుపాయం
ఐక్య ఉపాధ్యాయ, రాష్ట్రోపాధ్యాయ, పీఆర్టీయూ, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓడీ సదుపాయాన్ని అందిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
✅ దామోదర సంజీవయ్య జయంతి వేడుకలకు నిధుల కేటాయింపు
మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఫిబ్రవరి 14న జరిగే ఈ వేడుకల కోసం రూ.28 లక్షలు విడుదల చేసింది. ఇందులో కర్నూలు జిల్లాకు రూ.3 లక్షలు, మిగతా జిల్లాలకు ఒక్కొక్కటికి రూ.1 లక్ష చొప్పున కేటాయించింది.
✅ గ్రామ/వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ల భవిష్యత్తుపై కమిటీ
ప్రణాళిక శాఖలో సహాయ గణాంక అధికారులుగా డిజిటల్ అసిస్టెంట్ల నియామకానికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జనవరి 31న ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించింది.