జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్ రాయల్ తాజాగా చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనపై దుష్ప్రచారం చేయడానికి ఒక మహిళను ప్రేరేపించి రూ. 25 లక్షలు ఇచ్చి తనపై కుట్ర చేసారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో లక్ష్మి అనే మహిళ పాత్ర ఉందని, ఆమెపై రూ. 3 కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు.
కిరణ్ రాయల్ మాటల్లో..
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి తాను 15 ఏళ్లుగా అంకితభావంతో ఉన్నానని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానిగా గర్వంగా చెప్పుకుంటానని తెలిపారు. తాను ‘జగన్ 2.0’ పోస్టర్ విడుదల చేసిన తర్వాత వైసీపీ తనపై కుట్ర పన్నిందని, తన జీవితాన్ని నాశనం చేయాలని చూశారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా తనపై తీవ్ర విమర్శలు గుప్పించిందని, అదే శ్రద్ధ జగన్ ప్రచారంపై పెట్టుంటే పదిసీట్లు అదనంగా గెలిచేవారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
“నన్ను టార్గెట్ చేశారు..”
కిరణ్ రాయల్ ఆరోపణల ప్రకారం, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం లక్ష్మికి రూ. 25 లక్షలు ఇచ్చి తనపై కుట్ర పన్నిందని చెప్పారు. వైసీపీ నేతలు ఒక మహిళను అడ్డుపెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకున్నారని, ఆమెను జైపూర్ పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తాను “పవర్‌ఫుల్ దొండకాయ” అని వ్యాఖ్యానిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
జనసేన స్పందన..
కిరణ్ రాయల్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్‌ఫ్లిక్ట్ కమిటీకి ఆదేశాలు ఇచ్చారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీపై ఆరోపణలు..
కిరణ్ రాయల్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. తనను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం కాజేశారని, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆ మహిళ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో రాజకీయంగా గందరగోళం నెలకొంది.
ఇక ఈ ఆరోపణలను కిరణ్ రాయల్ ఖండిస్తూ, ఆర్థిక లావాదేవీలను రాజకీయం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. వైసీపీ తన గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని, కానీ తాను వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు.